Jamili: లోక్సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..! 5 d ago
ఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 'ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రణాళిక పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్రం మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్డామ్ మేఘ్వాల్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై సభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ మద్దతు తెలిపింది. ఈమేరకు ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు.లోక్ సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ..జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారని ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్ దుయ్యబట్టారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఆరోపించారు. అనంతరం టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు..ఎన్నికల సంస్కరణలు అని చెప్పారు. గతంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్సీఏసీ విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసిందని గుర్తు చేశారు. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే పరిస్థితి ఎదురవుతుంది అని మండిపడ్డారు.